ఈ సీస పద్యం అచ్చమైన పొడుపు కథ.

ఇది ప్రౌఢరాయల ఆస్థాన కవి ఎవరో రచించి ఉంటారు. ఎనిమిది ప్రశ్నలు? వాటికి జవాబులు ఈ చాటువులో కవి పొందుపరచాడు.

“ రాముడెవ్వానితో రావణు మర్దించె? పర వాసు దేవుని పట్నమేది ? రాజమన్నారుచే రంజిల్లు శరమేది ? వెలయ నిమ్మ పండు విత్తునేది? అల రంభ కొప్పులో అలరు పూదండేది? సభవారి నవ్వించు జాణ యెవడు? సీత పెండ్లికి ఓలిచేసిన విల్లేది? శ్రీ కృష్ణుడేయింట చెలగు చుండు? అన్నిటను జూడ ఐదేసి యక్షరములు ఈవ లావాల జూచిన నేక విధము చదువు నాతడు “ భావజ్ఞ చక్ర వర్తి” లక్షణోపేంద్ర ప్రౌఢరాయ క్షితీంద్ర !”.

👉పై పద్యంలో మొదటి ఎనిమిది పాదాలు ప్రశ్నలు. తదుపరి రెండు పాదాలు వాటి జవాబులు తెలిపే సూచికలు.

మూడవ పాదం ఎవరైతే జవాబులు చెపుతారో వారిని “ భావజ్ఞ చక్రవర్తి” అని పిలవాలని, నాల్గవ పాదం ప్రౌఢరాయల! సంబోధన.

👉ఇక జవాబుల సూచికలు- ప్రతి జవాబుకి ఐదు అక్షరాలు ఉంటాయి,

ముందునుంచి వెనుక నుంచి చదివినా ఒకేలా ఉంటాయి. (ఉదా;- “ కిటికి”వలె ).

1.రాముడు ఎవరిసాహాయంతో రావణుని చంపాడు? 2.వాసుదేవుని పట్నం పేరు ఏమిటి? 3.రాజమన్నారు అనే రాజు చేతిలో బాణం ఎమిటి?(శరము=బాణము)

  1. నిమ్మ పండు విత్తనం పేరు ఏది? 5.రంభ జడలో పెట్టుకొన్న పూలదండ పేరు? 6.సభలో నవ్వించే కవిపేరు ఏది? 7.సీత పెండ్లికి సుల్కంగా పెట్టిన విల్లు ఏది? ( ఓలి=శుల్కం) 8.శ్రీకృష్ణుడు ఎవరి యింట పెరిగేడు?
ఈ క్రింది జవాబులు చూడండి.

1.తోకమూకతో! ( వానరాలకి ఇంకొక పేరు.) 2.రంగనగరం! ( శ్రీరంగం ) 3.లకోల కోల! ( కోల= బాణం) 4.జంబీర బీజం! ( జంబీరం=నిమ్మపండు. బీజం=విత్తనం) 5.మందార దామం! ( దామం అంటే దండ) 6.వికట కవి! ( హాస్యకవి తెనాలి రామ కృష్ణుడు) 7.పంచాస్య చాపం! ( శివుని విల్లు) 8.నంద సదనం! ( నందుని ఇల్లు) పై జవాబులు ఐదు అక్షరాలతో, ఎటునుంచి చదివినా ఒకేలా ఉంటాయి.

👉అదే ఈ చాటు పద్యంలోని చమత్కారం. ఇట్టి చాటువుల ద్వారా భాషా జ్ఞానం, పద జ్ఞానం వృద్ది చెందుతాయి. ఇలాంటివి ఇంకా చదవాలని కుతూహలం పెంచుతాయి. పెద్దలు చదివి, పిల్లలకి కూడా తెలపగలరు.