కావ్యం అంటే ఏమిటి,దాని ప్రయోజనం

ఆంగ్లంలో కావ్యం, కవిత్వం అనే పదాలు సామాన్యంగా ఒకే అర్థంలో వాడబడుతూండటం గమనించవచ్చు. అదే తెలుగుకు వచ్చేసరికి…. కావ్యం వేరు, కవిత్వం వేరు. చిన్న ఖండికలు వేరుగా చెప్పబడుతున్నాయి. చాలా మంది శతకాలు కూడా కావ్యంగా పొరబడుతున్నారు. చిన్న ఖండికలు కొన్ని కలిసి కవిత్వంగా వెలువడవచ్చు. 
ఇక కొన్ని కవితలు కలిపితే లేదా దీర్ఘకవిత్వమైతే ఒక ప్రణాళిక లేదా కథ, సంఘటనతో కూడిన కవిత్వంగా రాస్తే దాన్ని కావ్యం అంటాం. అలాగే శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని కావ్యం అంటాం. అందులో గల ‘ప్రతిజ్ఞ’ అనే ఖండికను కావ్యం అనం.  ప్రాచీనుల దృష్టిలో కవిత్వం అంటే కేవలం ఛందోబద్ధ రచనగా రూఢమైంది. పద్యం, గద్యం, పద్య గద్యాత్మక చంపూ కావ్యమైనా కావ్యమే. కవి కలం నుంచి జాలువారిన అపూర్వ సృష్టి కావ్యం. కవి ఆత్మీయతలు కావ్యంలో ప్రతిఫలిస్తాయి.  
కావ్య ప్రయోజనం ఏమిటి
కావ్య రచన వల్ల, కావ్య పఠనం వల్ల నైపుణ్యం, కళా విజ్ఞానం అలవడుతుంది. మంచి కావ్యం వల్ల ఆనందం కలుగుతుంది అని మన ప్రాచీన కవులు చెప్పడం జరిగింది.  భామహుడు చెప్పిన దానిని బట్టి కూడా ఆనందం, అదే సమయంలో మన జీవితానికి పనికొచ్చే ఉపదేశాలు కావ్య ప్రయోజనాలని చెప్పవచ్చు. ఆనందవర్ధనుడు ‘సహృద యజన మన ప్రకాశమును కావ్య ప్రయోజనంగా చెప్పటం వల్ల ‘మనప్రీతికే’ ప్రాధాన్యమిచ్చాడు. అభినవ గుప్తుడు కూడా ‘ప్రీతి రేవ ప్రధానమ్‌’ అని ఆనందవర్ధనుని సమర్థించినాడు.  
ఇక భారతీయ ఆలంకారికుల కావ్య నిర్వచనాలు చూద్దాం
భరతుడు: ‘ఇతివృత్తంతు కావ్య శరీరమ్’.. నాట్యశాస్త్రంలో ఇతివృత్తమే కావ్య శరీరమని చెప్పారు. దండి: ‘కావ్యాదర్శం’లో ‘ఇష్టార్థ వ్యవచ్ఛిన్న పదావళీ కావ్యమ్’.. మనోహరమైన అర్థంతో కూడిన పదాల సమూహమే కావ్యమన్నారు. భామహుడు: ‘కావ్యాలంకారం’లో ‘శబ్దార్థౌసహితౌ కావ్యమ్’.. హితంతో కూడిన శబ్దార్థాల సమూహమే కావ్యమని చెప్పారు. రుద్రటుడు: శబ్దార్థాల సమాహారమే కావ్యమన్నారు.భోజుడు: సరస్వతీ కంఠాభరణంలో ‘నిర్దోషం గుణవత్కావ్యమలంకృతై రలంకృతమ్ రసాన్వితం కవిః కుర్వన్ కీర్తిం ప్రీతించవిదంతి’.. దోషరహితంగా, గుణసహితంగా, అలంకార యుక్తంగా రసాన్వితమైన కావ్యాన్ని రచించిన కవి యశాన్ని, ఆహ్లాదాన్ని పొందగలడు.మమ్మటుడు: ‘తదదోషౌశబ్దార్థౌ సగుణావనలంకృతే పునఃక్వాపికావ్యమ్’.. దోష రహితంగా, గుణ సహితంగా ఉన్న శబ్దార్థాలే కావ్యమని, ఒక్కొక్కసారి అలంకార రహితమైనా దాన్ని కావ్యంగా పరిగణించవచ్చని చెప్పారు. హేమచంద్రుడు: మమ్మటుడిలా మరింత స్పష్టంగా ‘అదోషౌసగుణౌ సాలంకారౌచ శబ్దార్థౌ కావ్యమ్’.. దోష రహితమైన, గుణసహితమైన, సాలంకారమైన శబ్దార్థాలే కావ్యమని చెప్పారు.విశ్వనాథుడు: సాహిత్య దర్పణంలో మమ్మటుడు, హేమచంద్రుడు చెప్పిన నిర్వచనాలను ఖండించారు. ఆయన అభిప్రాయంలో రస సంబంధ దోషమే దోషమని, శాబ్దిక దోషాలున్నా కావ్యత్వ హాని జరగదని రస ప్రాధాన్యంలో ‘వాక్యం రసాత్మకం కావ్యం’ అన్నారు. రస ప్రాధాన్య దృష్టితో రసవత్తరమైన ఒక మహావాక్యమే కావ్యమన్నారు. జగన్నాథ పండిత రాయలు: విశ్వనాథుడి నిర్వచనంలో అతివ్యాప్తి, అవ్యాప్తి దోషాలున్నాయని జగన్నాథ పండిత రాయలు విమర్శించారు. రసం లేకున్నా లోకోత్తర చమత్కార జనకాలైన వ్యంగ్య రచనలు లోకంలో కావ్యాలుగా గొప్పగా విలసిల్లుతున్నాయన్నారు. ఆయన ‘రమణీయార్థక ప్రతిపాదక శబ్దఃకావ్యమ్’.. రమణీయమైన అర్థాన్ని ప్రతిపాదించే శబ్దాల సమూహమే కావ్యమన్నారు. రమణీయమైంది రసవత్తరం కాకపోదని, విశ్వనాథుడి రస ప్రాధాన్యం కూడా ఇందులో ఉన్నందువల్ల దీన్ని నిర్దుష్టమైన నిర్వచనంగా ఆలంకారికులు నిర్ధారించారు.వామనుడు ‘రీతి’ని కావ్యాత్మగా నిర్వచించారు. ఆనంద వర్థనుడు ‘ధ్వని’ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. పీయూష వర్థనుడు పండిత రాయల అభిప్రాయానికి అనుగుణంగా కావ్యాన్ని నిర్వచించారు. శౌద్ధోదని.. విశ్వనాథుడి రస సిద్ధాంతానికి అనుగుణంగా కావ్యాన్ని ప్రతిపాదించారు. కుంతకుడు వక్రోక్తి సిద్ధాంతాన్ని వ్యక్తీకరించారు. క్షేమేంద్రుడు ఔచిత్య సిద్ధాంతాన్ని నిర్వచించారు.భారతీయ ఆలంకారికుల అభిప్రాయాలను అనుసరించి దోష రహితమైన, గుణ సహితమైన, రసవత్తరమైన రమణీయ శబ్దార్థాల సముదాయాన్ని కావ్యంగా పరిగణించడం సమంజసంగా ఉంటుంది.